ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి

ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలి
State Planning Commission Vice Chairman  Vinod Kumar
  • నీళ్ళే భవిష్యత్తుకు జీవనాధారం
  • నీటి విలువ తెలుసుకోకుంటే మిగిలేది కన్నీరే
  • రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్  వినోద్ కుమార్

ముద్ర తెలంగాణ బ్యూరో: ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని, నీళ్ళే సమస్త ప్రాణ కోటికి జీవన ఆధారం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నీటి ప్రాముఖ్యతపై చేపట్టిన జన చైతన్య ప్రచార యాత్రను మంత్రుల నివాస ప్రాంగణంలో ఆదివారం బోయినపల్లి వినోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్ లో నీటి ప్రాముఖ్యతపై ఏర్పాటు చేసిన సదస్సు, రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కవిత్వ ఉత్సవంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ నీటిని సంరక్షిస్తేనే భవిష్యత్తు ఉంటుందని, ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని పేర్కొన్నారు.

సమస్త ప్రాణ కోటికి, చెట్లకు, ముఖ్యంగా మానవ మనుగడకు నీటి ఆవశ్యకత ఎంతో కీలకం అని వినోద్ కుమార్ తెలిపారు.నీటి విలువ తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో 44,000 వేల చెరువులలో పూడికలు తీయించారని, తద్వారా భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని వినోద్ కుమార్ వివరించారు.కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలోని భూగర్భంలో దాదాపు ఐదారు వందల టీ.ఎం.సీ. ల నీరు భద్ర పర్చబడ్డాయని వినోద్ కుమార్ తెలిపారు. 

రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను పంటపొలాలకు, చెరువులు, కుంటలకు తరలించడం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పెరింగిందని వినోద్ కుమార్ తెలిపారు.నీటి ప్రాముఖ్యకతను ఎవరూ కూడా మర్చిపోవద్దు అని వినోద్ కుమార్ అన్నారు.నీటిని వృధా చేస్తే రేపటి తరాలకు మిగిలేది కన్నీరే అని ఆయన అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం, జల మండలి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నీటి విలువ తెలిపే కార్యక్రమాలను నిర్వహించడం గొప్ప విషయమని వినోద్ కుమార్ అన్నారు.గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, జల మండలి ఓ.ఎస్.డీ జాల సత్యనారాయణ, గాంధీ సంస్థల ప్రతినిధులు నాగసూరి వేణు గోపాల్, గిరిధర్ గౌడ్, గోపాల్, గణేష్ గౌడ్, గాంధారి ప్రభాకర్, హర్దీప్ రెడ్డి, రెండు తెలుగు రాష్ట్రాల కవులు, తదితరులు పాల్గొన్నారు. గాంధీ సంస్థలు రాష్ట్రంలో నిర్వహిస్తున్న కృషిని వినోద్ కుమార్ అభినందించారు.